: ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ సలహాదారుగా లంక క్రికెట్ దిగ్గజం!
శ్రీలంక క్రికెట్ కు మహేల జయవర్ధనే ఎన్నో ఏళ్లుగా మూలస్తంభంలా నిలిచాడు. అయితే, ఈ దిగ్గజం సేవలను లంక క్రికెట్ బోర్డు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపకపోయినా, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మాత్రం ముందుకొచ్చింది. మహేలను జట్టుకు బ్యాటింగ్ సలహాదారుగా నియమించాలని ఈసీబీ నిర్ణయించింది. అతడితో చర్చించినట్టు ఈసీబీ వర్గాలు తెలిపాయి. ఇంగ్లాండ్ జట్టు త్వరలోనే యూఏఈలో పాకిస్థాన్ తో ఆడనుంది. అటుపై బంగ్లాదేశ్ లోనూ, భారత్ లోనూ పర్యటిస్తుంది. తర్వాత శ్రీలంక, పాకిస్థాన్ దేశాలతో సొంతగడ్డపై ఆడి, పిమ్మట, 2016లో భారత్ లో టి20 వరల్డ్ కప్ లో పాల్గొంటుంది. మొత్తమ్మీద చూస్తే ఉపఖండం జట్లతోనే ఇంగ్లాండ్ ఎక్కువగా ఆడాల్సి ఉండడంతో ఆయా జట్లు, పిచ్ లపై అవగాహన ఉన్న మహేలను బ్యాటింగ్ సలహాదారుగా తీసుకుంటున్నట్టు అర్థమవుతోంది. అంతేగాదు, ప్రస్తుతం ఇంగ్లాండ్ కోచ్ ట్రెవర్ బేలిస్, అసిస్టెంట్ కోచ్ పాల్ ఫార్ బ్రేస్ లతో సాన్నిహిత్యం ఉండడం కూడా మహేలకు సానుకూలాంశంగా మారింది. వారు లంక జట్టుకు కోచింగ్ సిబ్బందిగా వ్యవహరించిన సమయంలో మహేల జట్టులో ఉన్నాడు.