: రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న జూలై 14 రాత్రి ఏం జరిగింది?
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి హత్యకు దారితీసిన కారణాలను వెలికితీసేందుకు గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి స్వయంగా రంగంలోకి దిగారు. తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్న ఒక సీనియర్, నలుగురు జూనియర్ విద్యార్థులను డీఎస్పీ ఆఫీసులో రెండు గంటల పాటు ఆయన ప్రశ్నించారు. రిషితేశ్వరి డైరీలో పేర్లను చెరిపేసింది ఎవరు? ఆమె ఆత్మహత్య చేసుకున్న జూలై 14 రాత్రి ఏం జరిగింది? వంటి ప్రశ్నలను ఆయన సంధించినట్టు పోలీసు వర్గాల సమాచారం. ఆ రోజు రాత్రి రిషితేశ్వరి 11 గంటల సమయంలో హాస్టలుకు వచ్చిందని, హాస్టల్లో ఆహారం లేకపోవడంతో ఆమె బంధువు ఫుడ్ పార్సిల్ తెచ్చి సెక్యూరిటీ చేతికి ఇచ్చిందని ఇంటరాగేషన్ లో వెల్లడైనట్టు సమాచారం. ఆపై హాస్టల్ ప్రధాన ద్వారం వద్దకు వచ్చిన ఆమె ఫుడ్ పార్సిల్ తీసుకుని తన గదికి వెళ్లే సమయంలోనే ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటనలు జరిగాయని పోలీసులు భావిస్తున్నారు. ఆ రోజు ఉదయం నుంచి హాస్టల్లో ఏం జరిగిందన్నది ప్రతి విద్యార్థినీ అడిగి తెలుసుకుంటున్నారు. గతంలో అదుపులోకి తీసుకున్న ముగ్గురు సీనియర్లతో పాటు మరో ఇద్దరు విద్యార్థులకూ ఘటనలో ప్రమేయమున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైందని తెలుస్తోంది. కాగా, ఈ దురదృష్టకర సంఘటన వెనుక కాలేజీ ప్రిన్సిపాల్ బాబూరావు హస్తంపైనా పోలీసులు విచారిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని చూసిన విద్యార్థినులు తొలుత బాబూరావుకు సమాచారం ఇవ్వగా, పోలీసులు రాకముందే ఆమె మృతదేహాన్ని ఎందుకు తరలించారన్న విషయమై పోలీసులు విచారిస్తున్నారు.