: నాపై చేసిన అనుచిత వ్యాఖ్యలను మోదీ ఉపసంహరించుకోవాలి: నితీష్ కుమార్ డిమాండ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే ఉపసంహరించుకోవాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ఒక బహిరంగ లేఖను సంధించారు. ప్రధాని వ్యాఖ్యలతో తన ప్రతిష్ట దెబ్బతిన్నదని... తన వ్యాఖ్యలతో బీహార్ ప్రజలను కూడా మోదీ అవమానించారని లేఖలో ఆరోపించారు. తన వ్యాఖ్యలను మోదీ వెనక్కి తీసుకోకపోతే బీహార్ ప్రజలు క్షమించరని అన్నారు. గత నెలలో బీహార్ లో పర్యటించిన సందర్భంగా, నితీష్ పై మోదీ విమర్శనాస్త్రాలు సంధించారు. జితన్ రాం మాంఝీ లాంటి మహాదళితుడిని అవమానించడం ద్వారా నితీష్ కుమార్ తనను కూడా అవమానించారని మోదీ విమర్శించారు. నితీష్ డీఎన్ఏలోనే ఏదో లోపం ఉన్నట్టుందని అన్నారు. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ మోదీకి లేఖాస్త్రం సంధించారు. తాను బీహార్ బిడ్డనని... బీహార్ ప్రజల డీఎన్ఏ, తన డీఎన్ఏ ఒకటేనని లేఖలో తెలిపారు. తన డీఎన్ఏ గురించి మాట్లాడి, బీహార్ ప్రజలను మోదీ అవమానించారని అన్నారు.