: హెచ్ సీయూలో విద్యార్థుల కొట్లాటకు కారణమైన 'ఫేస్ బుక్'!
నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్థి సంఘాల మధ్య జరిగిన కొట్లాటకు కారణం సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టులట. తమ సంఘ నాయకులను తిడుతూ ఏబీవీపీ నేత ఒకరు ఫేస్ బుక్ లో కామెంట్లు చేశారని ఆరోపిస్తూ, అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఎస్ఏ) నేతలు గొడవకు దిగారు. ఆపై ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్ కుమార్ పై దాడి చేయగా, ఆయన గాయపడ్డారు. దీనికి నిరసనగా ఏబీవీపీ ధర్నా చేపట్టగా, అది రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావు వర్శిటీకి వచ్చి ధర్నాకు మద్దతు పలికారు. సుశీల్ పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు ఏఎస్ఏ నేతలను అరెస్ట్ చేయడంతో ఏబీవీపీ నిరసనలు ముగియగా, ఏఎస్ఏ ధర్నా మొదలైంది. వీరికి పలు ఇతర స్టూడెంట్స్ యూనియన్ నుంచి మద్దతు లభించింది. పరిస్థితి విషమిస్తుందని భావించిన పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేశారు. మొత్తం ఘటనపై కమిటీ వేసి నిజానిజాలు తేలుస్తామని వర్శిటీ వైస్ చాన్స్ లర్ ఆర్.పీ శర్మ హామీ ఇచ్చారు.