: విశాఖలోని ‘డాల్ఫిన్’ హోటల్ లో పేకాట... 8 మందిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
విశాఖలోని డాల్ఫిన్’ హోటల్ లో గుట్టుగా సాగుతున్న పేకాటపై నిన్న విశాఖ పోలీసులు దాడి చేశారు. నాలుగు రోజులుగా హోటల్ గదిలో పేకాడుతున్న 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ హోటల్ లోని రూం నెంబరు:605లో కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా పేకాడుతున్నారు. దీనిపై విశాఖ సిటీ టాస్క్ ఫోర్స్ సీఐ ఇలియాస్ అహ్మద్ కు సమాచారం అందింది. తనకు అందిన సమాచారాన్ని నిర్ధారించుకున్న అహ్మద్ నిన్న పోలీసు బలగాలతో కలిసి డాల్ఫిన హోటల్ వద్దకు చేరుకున్నారు. ఏ గదిలో పేకాట జరుగుతోందన్న అంశంపై ఇన్ఫార్మర్ సహాయంతో నిర్ధారించుకుని వెనువెంటనే దాడి చేశారు. పేకాటలో మునిగిపోయిన 8 మందిని అరెస్ట్ చేసిన అహ్మద్ వారి నుంచి రూ.2,51,600 నగదుతో పాటు 9 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, హైదరాబాదు, కడప, జిల్లాలకు చెందినవారట. విశాఖ పోలీసు కమిషనర్ అమిత్ గార్గ్ సలహా మేరకు నిందితులను నగరంలో టూ టౌన్ పోలీసులకు అప్పగించినట్లు అహ్మద్ తెలిపారు.