: చేతికి నల్ల రిబ్బన్ కట్టిన రాహుల్... కదం తొక్కిన కాంగ్రెస్ ఎంపీలు


కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నేతలకు రాహుల్ గాంధీ యువరాజు. అయితే సింహాసనం ఎక్కాల్సిన ఆయన ఆందోళనకారుడి అవతారం ఎత్తక తప్పలేదు. ఎందుకంటే, మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభంజనానికి యువరాజా వారి కలలన్నీ కల్లలయ్యాయి. అందుతుందనుకున్న ప్రధాని పదవి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇక లోక్ సభలో అధికార పార్టీతో సమ ఉజ్జీ పోరుకు సరిపడా సంఖ్యా బలం లేక ఆయన శక్తి మరింత నిర్వీర్యమైపోయింది. అయితే రెండు నెలల పాటు అజ్ఞాతవాసానికి వెళ్లిన యువరాజు, అక్కడ ఏం నేర్చుకున్నారో కాని సభలో తక్కువ బలమున్నా, పోటీకి సై అన్నారు. అధికార పక్షంపై ముప్పేట దాడికి దిగారు. నిన్న పార్టీకి చెందిన ఎంపీల్లో సగానికిపైగా సస్పెండ్ కాగా, నేడు ఆయన నిరసనకారుడి అవతారం ఎత్తారు. కుడి చేతికి నల్ల రంగు రిబ్బన్ కట్టి పార్లమెంట్ హౌస్ నుంచి బయలుదేరారు. యువరాజా వారి ఉద్రేకం చూసి పార్టీ ఎంపీల్లో మరింత ఉత్సాహమొచ్చింది. అంతా కలిసి గాంధీ విగ్రహం ముందు కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల హోరు వినిపించారు.

  • Loading...

More Telugu News