: ఇదేమి చోద్యం! ఆర్బీఐ మాజీ గవర్నర్ సుబ్బారావు సంతకంతోనే నోట్ల ముద్రణ!
ఒక రూపాయి నోటుపై మినహా మిగతా అన్ని కరెన్సీ నోట్లపైనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకం ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆర్బీఐకి గవర్నర్ మారితే, ఆ తదుపరి సంవత్సరం జనవరి నుంచి ముద్రించే అన్ని కరెన్సీ నోట్లపై కొత్త గవర్నరు సంతకముండాలి. కానీ, ఆర్బీఐ గవర్నరుగా సెప్టెంబర్ 2013లోనే రఘురాం రాజన్ బాధ్యతలు స్వీకరించగా, ఆ తరువాత ముద్రించిన రూ. 500 నోట్లపై మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సంతకమే ఉందట. జనవరి 2014 నుంచి ముద్రించిన కరెన్సీ కాగితాలపై రఘురాం రాజన్ సంతకం ఉండాల్సి వుంది. కేవలం రూ. 10 కొత్త నోట్లపై మాత్రమే రాజన్ సంతకం కనిపిస్తోంది. మొత్తం రూ. 37.2 కోట్ల విలువైన కొత్త కరెన్సీ మాజీ గవర్నర్ సంతకంతో ముద్రితమైనట్టు కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) కనుగొంది. వీటన్నింటినీ మార్కెట్లోకి పంపరాదని ఆదేశించింది. దీంతో రూ. 20, రూ. 100, రూ. 500 నోట్లను 'దివాస్'లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ముద్రణా కార్యాలయంలోనే ఉంచేశారు. ఈ విషయంలో ఆర్బీఐ అభిప్రాయాన్ని స్వీకరించిన తరువాత వీటిని ఏం చేయాలన్న విషయంపై నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.