: వైఎస్ పథకాలపై పొగడ్తలు... కేసీఆర్ పై తెగడ్తలు: నాగం సంచలన వ్యాఖ్యలు


బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నాగం జనార్దన్ రెడ్డి ఏ వ్యాఖ్య చేసినా సంచలనమే. గతంలో టీడీపీ నేతగా ఓ వెలుగు వెలిగిన ఆయన రాష్ట్ర విభజన నేపథ్యంలో బీజేపీ నేతగా మారిపోయారు. తెలంగాణలో ప్రాజెక్టుల బాట పట్టిన నాగం... కేసీఆర్ సర్కారును తనదైన రీతిలో దునుమాడుతున్నారు. తాజాగా ఆయన కొద్దిసేపటి క్రితం మరోమారు కేసీఆర్ పై మాటల తూటాలను పేల్చారు. అంతటితో ఆగని నాగం మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘కేసీఆర్ ది మాటల ప్రభుత్వం. కేసీఆర్ గూగుల్ సీఎంగా ప్రసిద్ధికెక్కుతారు. నిజాంగిరీ చేస్తానంటే కుదరదు. అబ్దుల్ కలాం అంత్యక్రియలకు హాజరు కాని కేసీఆర్, డీఆర్డీఓకు కలాం పేరు పెట్టమనడం హాస్యాస్పదం. తెలంగాణ మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు’’ అని ఆయన కేసీఆర్, ఆయన మంత్రివర్గ సభ్యులపై విమర్శలు గుప్పించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదలకు లబ్ధి చేకూరిందని నాగం వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News