: అంతరిక్షంలోనూ ట్రాఫిక్ జామ్... ఆందోళనలో నాసా
అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు కొత్త సమస్య మొదలైంది. అదే, అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్. మార్స్ (అంగారకుడు) గ్రహం వద్ద ఈ సమస్యపై నాసా ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడ ప్రయోగాలు నిర్వహించేందుకు భారత్ కు చెందిన 'మామ్' (మార్స్ ఆర్బిటర్ మిషన్) సహా మరో రెండు ఉపగ్రహాలు మార్స్ చుట్టూ తిరుగుతున్నాయి. దీంతో మార్స్ చుట్టూ ట్రాఫిక్ ను అనునిత్యమూ పరిశీలించాల్సిన అవసరం ఏర్పడిందని నాసా తెలిపింది. ఇవి వేర్వేరు వేగాలతో మార్స్ చుట్టూ తిరుగుతూ ఉండడంతో, ఒకదానితో ఒకటి ఢీకొనే ప్రమాదం ఉందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ఇవి ఒకదానికి ఒకటి దగ్గరగా రాకుండా చూసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్టు నాసా తెలిపింది. ప్రస్తుతం మార్స్ చుట్టూ ఐదు శాటిలైట్లు తిరుగుతున్నాయని వివరించింది. అయితే, భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్లతో పోలిస్తే మార్స్ చుట్టూ ట్రాఫిక్ నియంత్రణ సులువని తెలుస్తోంది. భూమి చుట్టూ 1000కి పైగా వాడకంలో లేని శాటిలైట్లు, వివిధ హార్డ్ వేర్ ఉపకరణాలు తిరుగాడుతున్నాయి. ఇవి ఉపయోగంలో ఉన్న శాటిలైట్లను తాకకుండా చూసేందుకు నాసా ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణా వ్యవస్థ నిత్యమూ పహారా కాస్తోంది.