: ‘ఉల్లి ఘాటు’పై హరీశ్ సమీక్ష... తెలంగాణలోనూ రూ.20కే కిలో ఉల్లి విక్రయ కేంద్రాలు
కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తున్న ‘ఉల్లి ఘాటు’పై తెలంగాణ సర్కారు కూడా దృష్టి సారించక తప్పలేదు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రూ.20కే కిలో ఉల్లి కేంద్రాలను ప్రారంభించింది. ఏపీలోని రైతు బజార్లలో ఏర్పాటైన ఉల్లి విక్రయ కేంద్రాలతో అక్కడి ప్రజలకు కాస్తంత ఊరట లభిస్తోంది. తెలంగాణలో ఇలాంటి కేంద్రాలు ఇప్పటిదాకా లేవు. దీంతో, నానాటికీ పెరుగుతున్న ఉల్లి ధరలపై దృష్టి సారించిన తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మరికాసేపట్లో జిల్లా కలెక్టర్లతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఏపీ తరహాలోనే తెలంగాణలోనూ రూ.20కే కిలో ఉల్లి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని దాదాపుగా నిర్ణయించిన ఆయన, ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు. అంతేకాక రాష్ట్రవ్యాప్తంగా 80 విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని హరీశ్ రావు నిర్ణయించినట్లు సమాచారం.