: టీచర్లంటే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు ఎంతో గౌరవమట!
కరుడుగట్టిన కిరాతక నరహంతకులైన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులంటే ఎనలేని గౌరవమట. ఈ విషయాన్ని ఉగ్రవాదుల చేత కిడ్నాపునకు గురై ఆపై ప్రాణాలతో బయటపడ్డ కర్ణాటక, కోలార్ ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ విజయ్ కుమార్ తెలిపారు. తమను బంధించిన తరువాత ఓ చీకటి గదిలో ఉంచారని, ఒక రాత్రి అన్నం పెట్టలేదని, తమ పేర్లు, మతం, ఉద్యోగాల వివరాలు అడిగి తెలుసుకున్నారని ఆయన చెప్పారు. తాము వర్శిటీ అధ్యాపకులమని తెలుసుకున్న తరువాత తమ పట్ల వారి వైఖరి మారిందని తెలిపారు. తన పేరు షేక్ అని చెప్పుకున్న ఉగ్రవాద నాయకుడు, టీచర్లంటే తమకెంతో గౌరవమని, తమను చంపబోమని చెప్పినట్టు వివరించారు. ఇస్లాం గురించి ఏం తెలుసో చెప్పాలని ఆయన ప్రశ్నించాడని, భారత్ లో మత సామరస్యం గురించి వివరంగా చెబితే సంతోషించాడని అన్నారు. లిబియా నుంచి ఎందుకు వెళుతున్నావని ప్రశ్నించగా, తన ఆరు నెలల కుమార్తెను చూసేందుకు వెళ్తున్నట్టు సమాధానం ఇచ్చానని తెలిపారు. కాగా, మొత్తం నలుగురిని కిడ్నాప్ చేసిన తీవ్రవాదులు ఇద్దరిని విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. మరో ఇద్దరు తెలుగువారు ఇంకా వారి చెరలోనే ఉన్నారు. వీరిని కూడా విడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.