: కేంద్రం ప్రకటన మనకు వర్తించదు... ఏపీ వెరీ స్పెషల్ అంటున్న మంత్రులు
ఇకపై దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని, 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక, సాధారణ అంటూ రాష్ట్రాల మధ్య తేడాలను ప్రస్తావించలేదని కేంద్రం శుక్రవారం నాడు ప్రకటించడంపై భిన్న స్పందనలు వస్తున్నాయి. బీహార్ వంటి రాష్ట్రాలు కేంద్రంపై కారాలుమిరియాలు నూరుతుండగా, ఆంధ్రప్రదేశ్ అధికార పక్ష నేతలు మాత్రం ఇంకా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు దీనిపై మాట్లాడుతూ... కేంద్రం చేసిన ప్రకటన మనకు వర్తించదన్నారు. ఏపీ పరిస్థితి చాలా ప్రత్యేకమని, కేంద్రం ప్రకటనతో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ముడిపెట్టరాదని సూత్రీకరించారు. రాజ్యసభలో బీజేపీ స్పష్టంగా చెప్పిన మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అటు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఏమంటున్నారంటే... రంగరాజన్ కమిటీ సిఫారసులు అమల్లో ఉన్నాగానీ, తాము ప్రత్యేక హోదా కోసం శ్రమిస్తున్నామని, కేంద్రం కూడా ఏపీకి ప్రత్యేక హోదాపై కసరత్తులు చేస్తోందన్నారు. అయితే, ఎంపీ కొనకళ్ల మాత్రం భిన్న స్వరం వినిపించారు. ప్రత్యేక హోదా కోసం తాము పోరాడుతున్నామని, అది సాధ్యం కాకపోతే ప్రత్యేక హోదాకు సమానమైన ప్రత్యేక ప్యాకేజీ అడుగుతామని తెలిపారు.