: యూకేలో విమాన ప్రమాదం... లాడెన్ బంధువుల మృతి
దక్షిణ ఇంగ్లాండ్ లో ఓ ప్రైవేట్ జెట్ విమానం కూలిపోయింది. దాంట్లో ఉన్న నలుగురు వ్యక్తులు మరణించారని బ్రిటన్ లోని హాంప్ షైర్ పోలీస్ సర్వీస్ తెలిపింది. కాగా, ఘటనలో మృతిచెందిన వారు అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ బంధువులని సౌదీ, బ్రిటీష్ మీడియా సంస్థలు అంటున్నాయి. ప్రమాదంపై పోలీసు విభాగం ప్రతినిధి మాట్లాడుతూ... ఘటనలో ఎవరూ బతికి బయటపడలేదని, దురదృష్టవశాత్తూ పైలట్ సహా విమానంలో ఉన్న అందరూ ప్రాణాలు విడిచారని వివరించారు. మృతులు ఎవరన్నది గుర్తించాల్సి ఉండగా, అటు బ్రిటన్ లో సౌదీ ఎంబసీ సంతాప ప్రకటన చేసింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. ఘటనపై బ్రిటీష్ వర్గాలతో కలిసి దర్యాప్తు చేస్తామని సౌదీ ఎంబసీ పేర్కొంది.