: ఇతర రాష్ట్రాలతో ఏపీని పోల్చకండి: పార్లమెంటులో రామ్మోహన్ నాయుడు
ఆంధ్రప్రదేశ్ ను ఇతర రాష్ట్రాలతో పోల్చవద్దని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశంలోని ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని, బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామని కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ పార్లమెంటులో ప్రకటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ను దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చవద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్ లా ఏ రాష్ట్రాన్నీ ఏకపక్షంగా విభజించలేదని అన్నారు. ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా, ప్రజల్లో ఉన్న సందేహాలు తీర్చకుండా, సరైన వనరులను సమకూర్చకుండా విభజించిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా వర్తింపజేయాలని ఆయన కోరారు. ఏపీకి ప్రత్యేకహోదా నిరాకరిస్తే పరిస్థితి దిగజారుతుందని ఆయన పేర్కొన్నారు.