: బీసీసీఐ హెడ్ క్వార్టర్స్ 'బీకేసీ'కి తరలిస్తారట!
బీసీసీఐ ముంబయి వాంఖెడే స్టేడియంలో ఉన్న తన ప్రధాన కార్యాలయాన్ని తరలించేందుకు నిర్ణయించింది. ముంబయి శివారు ప్రాంతం బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో ముంబయి క్రికెట్ సంఘానికి చెందిన మైదానానికి హెడ్ క్వార్టర్స్ ను తరలించాలని భావిస్తోంది. తాము కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి తగినంత స్థలం చూపాలని బీసీసీఐ తాజాగా ముంబయి క్రికెట్ సంఘాన్ని కోరింది. దీనిపై ముంబయి క్రికెట్ వర్గాలు స్పందించాయి. తాము బీకేసీ కాంప్లెక్స్ లో క్లబ్ హౌస్ కు ఎదురుగా ఓ నిర్మాణం చేపట్టాలనుకుంటున్నామని, అందులోనే బీసీసీఐ కార్యాలయం కోసం స్థలం చూపుతామని ముంబయి క్రికెట్ సంఘానికి చెందిన ఓ వ్యక్తి తెలిపారు. ఛత్రపతి శివాజీ ఎయిర్ పోర్టుకు బాగా దగ్గరగా ఉండే బీకేసీకి తన కార్యాలయాన్ని తరలించాలని బీసీసీఐ కోరుకుంటోందని ఆ వ్యక్తి పేర్కొన్నారు. తాము నిర్మించబోయే భవనంలోనే ఓ చిన్న మీడియా గ్యాలరీ, కొన్ని గదులు నిర్మిస్తామని వివరించారు.