: ఇండియాను నమ్మి దావూద్ వచ్చినా ఇదే జరిగుండేది: చోటా షకీల్
లొంగిపోయి విచారణకు సహకరిస్తే, ప్రాణాపాయం లేకుండా చూసి రక్షణ కల్పిస్తామని, జైలు శిక్ష నుంచి తప్పిస్తామని భారత ప్రభుత్వ అధికారులు చెప్పిన మాటలు విన్న పాపానికి యాకూబ్ మెమన్ ఉరికంబం ఎక్కాడని దావూద్ ఇబ్రహీం మాజీ అనుచరుడు చోటా షకీల్ వ్యాఖ్యానించాడు. భారత సర్కారు, ఇచ్చిన హామీలను మరచి వెన్నుపోటు పొడిచిందని అన్నాడు. 1993 బాంబు పేలుళ్ల తరువాత లొంగిపోతే సకల సౌకర్యాలు కల్పిస్తామని దావూద్ ఇబ్రహీంకు సైతం ఆశ పెట్టారని, అప్పట్లో ఆయన లొంగిపోయినా, ఇదే గతి పట్టి ఉండేదని షకీల్ అభిప్రాయపడ్డాడు. అప్పట్లో లొంగుబాటు తరువాత నెలకొనే పరిణామాలపై ఉన్న అనుమానాలు ఇప్పుడు నిజమయ్యాయని అన్నాడు. ఇకపై ఎవ్వరూ భారత ప్రభుత్వం ఇస్తున్న 'చాక్లెట్'లను తీసుకోరని అన్నాడు. ఏ భారత ఏజన్సీ చేసే ప్రామిస్ లనూ నమ్మే పరిస్థితి లేకుండా పోయిందని, భారత ప్రభుత్వాన్ని భవిష్యత్తులో ఎవరూ నమ్మరని వివరించాడు. టైగర్ మెమన్ పేరును చార్జ్ షీట్లో రాసిన భారత సర్కారు, ఆడియో, వీడియో సాక్ష్యాలను తెచ్చిచ్చిన మరో వ్యక్తిని బలిపశువును చేసిందని ఆరోపించాడు. కేవలం భారత ఏజన్సీల మాటలను నమ్మే యాకూబ్ ఇండియాకు తిరిగొచ్చాడని చెప్పాడు. దావూద్ తో యాకూబ్ కు ఎటువంటి సంబంధమూ లేదని స్పష్టం చేశాడు.