: ఆస్ట్రేలియాలో భారత టెక్కీ హత్య... మంగళూరుకు రానున్న కాప్స్
ఆస్ట్రేలియాలో సంచలనం సృష్టించిన భారత ఐటీ ఉద్యోగిని ప్రభా అరుణ్ కుమార్ దారుణ హత్య కేసులో విచారణ నిమిత్తం ఆ దేశ పోలీసులు మంగళూరు రానున్నారు. ఈ విషయాన్ని కేసును విచారిస్తున్న అధికారి రిట్చీ సిమ్ తెలిపారు. మార్చి7న తన ఇంటికి అత్యంత సమీపంలోని ఓ పార్కులో ప్రభ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు. విచారణలో సైతం ఎటువంటి ఆధారాలూ లభించలేదు. దీంతో ఏ ఒక్క మార్గాన్నీ వదలకుండా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు, అందులో భాగంగా ఆమె స్వగ్రామం మంగళూరుకు వెళ్లాలని నిర్ణయించారు. కాగా, ఆస్ట్రేలియా పోలీసులు తాజాగా విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజ్ లో ఆమె హత్య జరిగిన స్థలంలో ఓ వ్యక్తి నడుస్తూ వెళ్లినట్టు ఉంది. ఆ వ్యక్తి ఎవరన్న విషయం ఇంతవరకూ తెలియలేదని, అతన్ని ప్రశ్నించాలని భావిస్తున్నామని సిమ్ వివరించారు. ఈ కేసు చిక్కుముడులను ఎలాగైనా విడదీయాలని ఆస్ట్రేలియా అధికారులు ప్రత్యేక డిటెక్టివ్ బృందాన్ని సైతం ఏర్పాటు చేశారు. నవంబర్ 22న ఆమె పుట్టిన రోజునాడు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామని, అందుకు ఆమె భర్త, కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తామని సిమ్ తెలిపారు. వారు అంగీకరిస్తే, ప్రభ కుటుంబం ఆస్ట్రేలియా వచ్చి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. ఇండియాలోని తన భర్తతో ఫోన్లో మాట్లాడుతూ నడిచి వెళ్తున్న ప్రభను ఆమె ఇంటికి సమీపంలోనే అటకాయించిన ఓ వ్యక్తి హత్య చేశాడు. 'వాడు నన్ను కొడుతున్నాడు డియర్' అన్న మాటలే ఆమె నోటి నుంచి వచ్చిన చివరి మాటలుగా నిలిచిపోయాయి.