: ఎంపీలపై వ్యాఖ్యలకు రాబర్ట్ వాద్రా సమాధానం... క్షమాపణ చెప్పేందుకు నిరాకరణ
ఫేస్ బుక్ లో ఎంపీలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పనని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా స్పష్టం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పార్లమెంట్ నోటీసులకు ఇచ్చిన తిరుగు సమాధానంలో పేర్కొన్నారు. తన అభిప్రాయాలు వెల్లడించే హక్కు తనకుందని స్పష్టం చేశారు. అయితే పార్లమెంట్ అంటే తనకెంతో గౌరవం ఉందని, పార్లమెంట్ ను తాను అగౌరవపరచలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాద్రా వ్యవహారాన్ని ప్రివిలేజ్ కమిటీకి విన్నవించాలా? లేక, ఇంతటితో ఈ విషయాన్ని ముగించాలా? అనేది స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయిస్తారు. "పార్లమెంట్ సమావేశాలు మళ్లీ మొదలవుతున్నాయి. విషయాలను పక్కదారి పట్టించేందుకు రాజకీయ ఎత్తుగడలు వేసుకోనివ్వండి. ప్రజలేమీ తెలివి తక్కువవాళ్లు కాదు. ఇలాంటి నాయకుల నాయకత్వంలో దేశాన్ని చూడాల్సి రావడం బాధాకరం" అంటూ ఫేస్ బుక్ లో వాద్రా కొన్ని రోజుల కిందట పోస్టు చేశారు. దాంతో మండిపడిన బీజేపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. లోక్ సభలో బీజేపీ చీఫ్ విప్ అర్జున్ రామ్ మేగవాల్ ఓ ప్రవిలేజ్ మోషన్ కూడా పెట్టారు. దాంతో వాద్రాకు లోక్ సభ సెక్రెటరీ నోటీసులు పంపి ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలన్నారు.