: వేలానికి పాప్ రారాజు చేతి తొడుగు
అద్భుతమైన గాన, నృత్య ప్రదర్శనలు, గీత గుచ్ఛాలతో అభిమానులను ఉర్రూతలూగించిన పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ ఈ లోకంలో లేకున్నా, పాటల రూపంలో ఆయన స్మృతులు పదిలంగానే ఉన్నాయి. ఆయన వాడిన వస్తువులను వేలంలో భారీ మొత్తం చెల్లించి దక్కించుకునే వీరాభిమానులకు కొదవలేదు. తాజాగా, జాక్సన్ వైట్ గ్లోవ్ ను వేలం వేయనున్నారు. అంతకుముందు 2009లో జాక్సన్ 'మూన్ వాక్' గ్లోవ్ ను వేలం వేయగా రూ. 2 కోట్లకు ఓ అభిమాని చేజిక్కించుకున్నాడు. ఎంజేకు చెందిన మరో గ్లోవ్ ను 2010లో వేలం వేయగా అది కోటి రూపాయలు పలికింది. తాజాగా వేలం వేయనున్న తెల్లని చేతి తొడుగును జాక్సన్ తన మిత్రుడు పాల్ బెడార్డ్ కు కానుకగా ఇచ్చాడు. బెడార్డ్ మంచి చిత్రకారుడు. జాక్సన్ విశాల గృహ సముదాయం నెవర్లాండ్ రాంచ్ లో బెడార్డ్ డజనుకు పైగా పెయింటింగ్ లు వేశాడు. వేలంలో వైట్ గ్లోవ్ ను దక్కించుకునే వ్యక్తికి బెడార్డ్ చేతి తొడుగు ధరించి ఉన్న ఫొటోను, జాక్సన్ కోసం ఆయన వేసిన చిత్రాలు, గ్లోవ్ పై హక్కుల పత్రాన్ని కూడా అందిస్తారు.