: ప్రపంచంలోని సగం మంది నెటిజన్లు వాడే సోషల్ నెట్ వర్కింగ్ సైటు ఇదే!
ప్రపంచంలో ఎక్కువ మంది నెటిజన్లు వాడుతున్న వెబ్ సైట్ ఏంటని ప్రశ్నిస్తే, 'గూగుల్' అని సమాధానం వస్తుంది. అదే సామాజిక మాధ్యమాల్లో ఆ ఘనత తమదేనని 'ఫేస్ బుక్' చెబుతోంది. వరల్డ్ వైడ్ ఆన్ లైన్ యూజర్లలో సగం మంది నెలకు కనీసం ఒకసారన్నా ఫేస్ బుక్ లో లాగిన్ అవుతున్నారని సంస్థ వివరించింది. జూన్ 30తో మూడు నెలల్లో ఫేస్ బుక్ ను వాడుతున్న వారి సంఖ్య 13 శాతం పెరిగిందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది ఇంటర్నెట్ ను వాడుతుండగా, ఫేస్ బుక్ లో లాగిన్ అవుతున్న వారి సంఖ్య 149 కోట్లుగా ఉందని తెలిపింది. వీరిలో 65 శాతం మంది ప్రతిరోజూ ఫేస్ బుక్ ను చూస్తున్నారని వివరించింది. స్మార్ట్ ఫోన్లను వాడుతున్న వారు ప్రతి ఐదు నిమిషాల్లో ఒక నిమిషాన్ని ఫేస్ బుక్ చూసేందుకు కేటాయిస్తున్నారని సంస్థ ప్రతినిధి వివరించినట్టు 'బీబీసీ న్యూస్' ఓ కథనాన్ని ప్రసారం చేసింది.