: 100 విమానాలు కొననున్న స్పైస్ జెట్!


వచ్చే ఎనిమిదేళ్లలో 100 కొత్త విమానాలు కొనుగోలు చేయాలన్న భారీ ప్రణాళికల్లో భాగంగా లోకాస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థ స్పైస్ జెట్ బోయింగ్, ఎయిర్ బస్ లతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం స్పైస్ జెట్ పలు విమానాలను అద్దెకు తీసుకుని సేవలందిస్తోంది. ఈ అద్దె కాంట్రాక్టులు వచ్చే నాలుగేళ్లలో ముగియనుండడంతో, వాటి స్థానంలో కొత్త విమానాల వైపు వెళ్లాలని సంస్థ భావిస్తోంది. 2025 నాటికి 80 నుంచి 120 విమానాలను సొంతంగా సమకూర్చుకోవాలన్నది స్పైస్ జెట్ అభిమతం. ఇప్పుడు స్పైస్ జెట్ వద్ద 34 విమానాలున్నాయి. 18 బోయింగ్ 737, రెండు ఎయిర్ బస్ ఏ 319, 14 బొంబార్డియర్ క్యూ 400 టర్బో ప్రాప్ మోడల్ విమానాలున్నాయి. ఈ సంవత్సరాంతానికి బోయింగ్ 737ల సంఖ్యను 26కు చేర్చాలని ముందే ప్రణాళికలు వేసిన సంస్థ ఇప్పటికే బోయింగ్ కు అడ్వాన్సులు కూడా చెల్లించింది. 2018 నాటికి 42 విమానాల కోసం 4.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 27 వేల కోట్లు) ఆర్డర్ ను ఇచ్చింది. 2018 తరువాత ప్రతియేటా ఒక బోయింగ్ 737 మాక్స్ ఎయిర్ క్రాఫ్ట్ డెలివరీ తీసుకోనున్నట్టు సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కిరణ్ కోటేశ్వర్ వివరించారు. తమ ప్రణాళికలకు డీజీసీఏ నుంచి అనుమతులు రావాల్సి వున్నాయని, భారత విమానయాన మార్కెట్, ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతున్న తీరును గమనిస్తున్నామని అన్నారు. కాగా, గడచిన జూన్ త్రైమాసికంలో సంస్థ చరిత్రలోనే అత్యధికంగా రూ. 72 కోట్ల నికర లాభం నమోదైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News