: అర్ధరాత్రి హైడ్రామా... 'యాకుబ్ కు ఉరే సరి' అన్న సుప్రీం ధర్మాసనం
మహారాష్ట్రలోని నాగ్ పూర్ జైల్లో ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ ఉన్నాడు. అతడికి ఇదివరకే ఖరారైన ఉరి శిక్షను అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే దేశ రాజధాని ఢిల్లీలో రాత్రంతా హైడ్రామా కొనసాగింది. తనకు క్షమాభిక్ష ప్రసాదించాలన్న పిటిషన్ పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో రాత్రి 2 గంటలకు మొదలైన విచారణ దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. అంతకుముందు నిన్న సాయంత్రానికే యాకుబ్ క్షమాభిక్ష పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా యాకుబ్ క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరిస్తూ నిన్న రాత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉరిని 14 రోజుల పాటు వాయిదా వేయాలంటూ మెమన్ లాయర్లు చివరి ప్రయత్నంగా అర్ధరాత్రి సుప్రీం తలుపుతట్టారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు దేశ చరిత్రలోనే తొలిసారి అర్ధరాత్రి విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు ఆదేశాల మేరకు జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. ఉరి శిక్షను వాయిదా వేయాల్సిన సహేతుక కారణాలు తమకేమీ కనిపించడం లేదని పేర్కొన్న ధర్మాసనం, యాకుబ్ కు ఇప్పటికే సరిపడినంత సమయం ఇచ్చామని పేర్కొంది. 'యాకుబ్ కు ఉరే సరి' అని తుది తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో రాత్రంతా హైడ్రామా నెలకొంది.