: 2 గంటలు, 13 పేలుళ్లు, 257 మంది ప్రాణాల బలి... మరణశిక్ష కాక ఇంకేంటి?


రెండు గంటల వ్యవధిలో 13 చోట్ల బాంబు పేలుళ్లు... దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన మారణకాండ. దేశమంతా వణికిన ఈ ఘటనలో 257 మంది అమాయక ప్రాణాలు గాల్లో కలిశాయి. ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ దగ్గర మొదలైన పేలుళ్లు ఎయిరిండియా భవనం వరకూ కొనసాగాయి. 1993, మార్చి 12న జరిగిన ఈ పేలుళ్ల వెనకున్న అసలు నిందితులంతా తప్పించుకునే తిరుగుతున్నారు. దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్ ప్రధాన నిందితులు. ఇప్పటికీ వీరికి పాకిస్థాన్ వీఐపీ ట్రీట్ మెంటు ఇచ్చి పోషిస్తోంది. ఈ కేసులో పోలీసులకు పట్టుబడ్డ వ్యక్తి టైగర్ మెమన్ సోదరుడు యాకూబ్ మెమన్. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం నుంచి వారికి కావాల్సిన ఆయుధాల వరకూ దగ్గరుండి చూసుకున్నాడు. సుదీర్ఘ విచారణ తరువాత టాడా కోర్టు మరణశిక్ష విధించగా సుప్రీంకోర్టు కూడా దానిని ఖరారు చేసింది. అతను పెట్టుకున్న అన్ని క్షమాభిక్ష పిటీషన్లూ తిరస్కరణకు గురికాబడ్డాయి. మహారాష్ట్ర గవర్నరు నుంచి దేశ రాష్ట్రపతి వరకూ యాకూబ్ కు ఉరిశిక్ష సరైనదేనని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టులో యాకూబ్ తరపు న్యాయవాదులు వేసిన తుది క్యూరేటివ్ పిటిషన్ తిరస్కరణకు గురి కాగా, ఆ వెంటనే డెత్ వారెంట్ కూడా సక్రమంగా ఉందని సుప్రీం త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. విచారణ సక్రమంగానే సాగిందని పేర్కొంది. ఇక రేపు ఉదయం దేశం నిద్రలేచే సమయానికి మెమన్ ఉరితీత కార్యక్రమం పూర్తయిపోతుంది. ఇందుకోసం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. వందలాది మంది ప్రాణాలను తీసి వేలాది మందిలో విషాదాన్ని నింపిన కర్కోటక మెమన్ కు ఉరిశిక్షే సరైనదని బాధిత కుటుంబాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలావుండగా, తన ప్రాణాలను ఎలాగైనా కాపాడుకోవాలన్న ఏకైక లక్ష్యంతో మరోసారి రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ మెమన్ పిటిషన్ పెట్టుకున్నాడు. ఈ పిటిషన్ పై నేటి సాయంత్రంలోగా ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం వెలువడుతుందని అంచనా. ప్రణబ్ కూడా ఉరిశిక్ష వైపే మొగ్గు చూపితే రేపు మెమన్ ఉరితీత నూటికి నూరు శాతం ఖాయం. మెమన్ ఉరి ఆగాలంటే, అది ఒక్క దేశ ప్రథమ పౌరుడి చేతుల్లోనే ఉంది.

  • Loading...

More Telugu News