: దూరమవుతున్న క్లయింట్లతో ఔట్ సోర్సింగ్ కంపెనీలకు తెలుస్తున్న బాధ!


సంప్రదాయ సాంకేతికతపై పెట్టే పెట్టుబడులను సమీక్షిస్తున్న ఐటీ కంపెనీల క్లయింట్లు, క్లౌడ్, అనలిటిక్స్, సోషల్ మీడియా వంటి నూతనతరం సాంకేతికతల వైపు కదులుతుండగా ఆ ప్రభావం మొత్తం ఇండస్ట్రీపై కనిపిస్తోంది. ముఖ్యంగా ఔట్ సోర్సింగ్ సేవలందిస్తున్న కంపెనీలకు రావాల్సిన ఆదాయానికి గండి పడుతోందని, దూరమవుతున్న క్లయింట్లతో పలు కంపెనీలు బాధను అనుభవిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో భారత ఐటీ కంపెనీలు వెల్లడించిన ఆర్థిక గణాంకాలే అందుకు ఉదాహరణని చెబుతున్నారు. క్లయింట్లను పోగొట్టుకోకుండా ఉండేందుకు దేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్, గత సంవత్సరంతో పోలిస్తే సేవా ధరలను 3.3 శాతం తగ్గించింది. ఇదే సమయంలో మరో ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ ధరలను 1.3 శాతం తగ్గించింది. సెక్టారువారీగా ఐటీ సేవల తీరును పరిశీలిస్తే, ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో సరాసరిన 1 నుంచి 3 శాతం మేరకు ధరలు తగ్గాయి. దీంతో ఐటి కంపెనీల మార్జిన్లపై కూడా ప్రభావం పడి ఆదాయాలు, నికర లాభాలు తగ్గాయి. "ఐటీ కంపెనీల క్లయింట్లు కొత్త మార్గాల ద్వారా సేవలను పొందుతూ ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్నారు. అప్లికేషన్స్ నిర్వహణ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, టెస్టింగ్ టూల్స్ వంటి విషయాల్లో సాధ్యమైనంత తక్కువ వెచ్చించాలని భావిస్తున్నారని ఇన్ఫోసిస్ సీఓఓ ప్రవీణ్ రావు వ్యాఖ్యానించారు". ఐటీ కంపెనీల మధ్య పోటీ వల్ల మాత్రమే మార్జిన్లు తగ్గుతున్నాయని భావించడం సరికాదని, పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పటికీ డీల్స్ కుదుర్చుకుంటున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కాగా, ఇప్పటికిప్పుడు మార్జిన్లు భారీగా తగ్గే ప్రమాదాలు లేవని టీసీఎస్ చీఫ్ ఎన్ చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి సేవల ధరలు స్థిరంగానే ఉండవచ్చని అన్నారు. కొన్ని సంస్థలపై మాత్రం ఈ ప్రభావం ఉంటుందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News