: దాచుకున్న వారికి దాచుకున్నంత... నిశ్చింతగా ఉండాలంటే..!


'గణేషన్నా... ఓ ఐదు వేలుంటే ఇవ్వవా? మళ్లీ జీతం రాగానే తిరిగి ఇచ్చేస్తాను...' ఇటువంటి మాటలు, చేబదుళ్ల సంగతి ప్రతిఒక్కరికీ అనుభవమే. అవసరానికి అడగటం, తీసుకొని తిరిగి ఇవ్వడం మామూలే. అయితే, ఇలా అడగకుండా ఉండాలంటే... డబ్బు కష్టాలు వచ్చినప్పుడు ఆదుకోవడం కోసం ప్రతిఒక్కరూ ప్రత్యేకంగా ఓ అత్యవసర 'నిధి'ని కొనసాగించాలని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఎటువంటి కష్టాలు పడకుండా గట్టెక్కాలంటే ఈ నిధి సహకరిస్తుంది. మరి దీన్ని ఎలా పెంచుకోవాలి? వాస్తవానికి చాలా కొద్ది మంది దగ్గరే డబ్బు నిల్వ ఉంటుంది. వచ్చే వేతనం నెల ఖర్చులకే బొటాబొటిగా సరిపోతుండగా, ఇక దాచుకునేది ఎక్కడ? అని ప్రశ్నించేవారే అత్యధికులు. అయితే, ఇంకాస్త పొదుపుగా ఉంటే డబ్బు అదే పోగవుతుంది. ప్రతిఒక్కరూ కనీసం 3 నుంచి 6 నెలల వరకూ కుటుంబ ఖర్చులకు సరిపడేంత డబ్బు తప్పనిసరిగా పొదుపు చేయాలని విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. అందుకోసం ఏం చేయాలో సూచిస్తున్నారు. అసలు నిధి అవసరం ఎప్పుడు?: ఉన్న ఉద్యోగం పోవడం లేదా దురదృష్టకర పరిస్థితుల్లో విధులకు వెళ్లలేక పోవడం, అనుకోకుండా అనారోగ్యం పాలుకావడం వంటి స్థితి ఏర్పడినప్పుడు డబ్బులు అవసరపడతాయిగా? అందుకోసమే ఈ అత్యవసర నిధి. నిధి ఎలా ఉండాలి?: అత్యవసరం అంటే అత్యవసరమే. వెంటనే డబ్బు చేతిలోకి వచ్చే విధంగా పొదుపు చేస్తుండాలి. అంటే ఏటీఎంలోకి వెళ్లి తీసుకునేలా డబ్బు బ్యాంకుల్లో ఉంటే ఉత్తమం. అలా కాకుండా స్టాక్ మార్కెట్లలోనో మరే రూపంలోనో 'సేవ్' చేసి వుంటే చేతికి డబ్బు అందేందుకు రెండు మూడు రోజుల సమయం పడుతుంది. ఆలోగా వచ్చిన అవసరం పెద్దదైతే అప్పులు చేయాల్సి వస్తుంది. ఎంత ఉండాలి?: ఇంట్లో నెలసరి అద్దెలు, పాలు, వెచ్చాలు తదితరాల నుంచి పిల్లల స్కూలు ఫీజుల వరకూ రూ. 15 వేలు అవసరమౌతాయని భావిస్తే, రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష వరకూ నిధి ఉండాలి. అంటే, కష్టాలు ఎదురైన వేళ, వాటినుంచి బయట పడేందుకు కనీసం మూడు నెలల సమయం ఉంటుంది. ఈ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించుకుని బయటపడొచ్చు. ఎలా పోగు చేయాలి?: మీకు లభించే ఆదాయాన్ని బట్టి అత్యవసర నిధికి ఎంత కేటాయిస్తారో లెక్కించుకోవాలి. సంపాదనలో 5 నుంచి 10 శాతం మేరకు కేటాయిస్తే, రెండు నుంచి నాలుగేళ్లలో మీకు అవసరమైన నిధి పోగవుతుంది. మీరు దాచే డబ్బుకు కనీస వడ్డీ కూడా లభిస్తుంది కాబట్టి, నాలుగేళ్లు దాచిన డబ్బు మరో నెల రోజులు అదనంగా వాడుకునేందుకు సిద్ధమవుతుంది. ఎక్కడ పొదుపు చేయాలి?: ఇందుకోసం నష్టభయం లేని పొదుపు ఖాతాలు, రికరింగ్ డిపాజిట్లు ఎంచుకుంటే మంచిది. డబ్బు సరిపడినంత పోగైన తరువాతనే నష్టభయమున్నా, అధిక రాబడిని ఇచ్చే మ్యూచువల్ ఫండ్ వంటి పథకాలను ఎంచుకోవచ్చు. డెట్ ఫండ్స్ కూడా ఎంచుకోవచ్చు. అయితే, ఈ పథకాల్లో డబ్బు రావడానికి రెండు రోజుల సమయం పడుతుంది. బ్యాంకులో చేసే పొదుపుపై 4 శాతం వరకూ వడ్డీ లభిస్తుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు కస్టమర్లకు ఏటీఎం కార్డులను అందిస్తున్నాయి. దీన్ని డెబిట్ కార్డులా వాడుతూ, ఫండ్ లో ఉన్న పెట్టుబడి నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు తీసుకోవచ్చు. ఇక చివరిగా తట్టుకోలేని అత్యవసరం ఏర్పడితేనే ఈ నిధిని తాకాలన్న గట్టి నియమాన్ని ఎల్లప్పుడూ పాటిస్తుండాలి.

  • Loading...

More Telugu News