: అజయ్ దేవగణ్ ను కలిసిన 'బాహుబలి'
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ను 'బాహుబలి' ప్రభాస్ కలిశాడు. ఢిల్లీలోని ఓ హోటల్ లో పెదనాన్న కృష్ణంరాజు, పెద్దమ్మతో గత వారం రోజులుగా ప్రభాస్ ఉంటున్నాడు. అక్కడి నుంచే ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తున్నాడు. బాలీవుడ్ 'దృశ్యం' సినిమా ప్రమోషన్ కోసం ఢిల్లీ వచ్చిన అజయ్ దేవగణ్ ఇదే హోటల్ లో దిగారు. దీంతో మిమ్మల్ని కలవాలనుకుంటున్నానని 'బాహుబలి' అజయ్ కి మెసేజ్ పెట్టాడు. 'దాందేముంది, కలుద్దాం రండి' అంటూ అజయ్, ప్రభాస్ ను ఆహ్వానించాడు. దీంతో ప్రభాస్ కుటుంబ సభ్యులతో కలిసి అజయ్ ను కలిశాడు. ఈ సందర్భంగా ఇద్దరూ పలు సినిమాలపై చర్చించారు. ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు తిరగరాస్తున్న 'బాహుబలి' తనకు నచ్చిందని అజయ్ దేవగణ్ ప్రభాస్ ను అభినందించాడు.