: మరోసారి అందరిలోనూ ఆసక్తి రేకెత్తించిన యాసిన్ భత్కల్
దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితుడు యాసిన్ భత్కల్ ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యే సమయంలో అతడు ఓసారి గులాబీతో, మరోసారి పుస్తకంతో కనిపించి మీడియాను ఆకర్షించాడు. తాజాగా, మంగళవారం రంగారెడ్డి జిల్లా న్యాయస్థానానికి వచ్చినప్పుడు కూడా ఇలాగే ప్రవర్తించడంతో అందరిలోనూ ఆసక్తి రేకెత్తింది. పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచేందుకు తీసుకురాగా, భత్కల్ కోర్టు ఆవరణలో ఓ లేఖను విసిరేశాడు. అయితే, ఆ లేఖలో ఏం రాశాడన్నది ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఆ లేఖ పోలీసుల వద్ద ఉంది. ఇండియన్ ముజాహిదిన్ సహ వ్యవస్థాపకుడైన యాసిన్ భత్కల్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడన్న విషయం అందరిలోనూ కుతూహలం కలిగిస్తోంది.