: పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ వరకు... కలాం మహాప్రస్థానం!
'వ్యవస్థను మార్చాలనుకుంటే... అవాంతరాలను అధిగమించాల్సిందే'... లోకజ్ఞానం తెలియని వయసులో తన గురువు శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ చెప్పిన ఈ మాటలు ఆ చిన్నారిని ఇతరులకు సాధ్యం కాని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేశాయి. ఆ చిన్నారే భారతరత్న, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఎక్కడో సముద్రతీరంలో విసిరేసినట్టు ఉండే చిన్న గ్రామమైన రామేశ్వరంలో పుట్టిన భరతమాత ముద్దు బిడ్డ కలాం... చివరకు ఇక సాధించడానికి ఏమీ లేదన్నంతగా, భారతరత్న వరకు ఎదిగారు. భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన కలాం పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. 1931 అక్టోబర్ 15న నిరుపేద జైనులబ్దీన్, ఆషియమ్మా దంపతులకు జన్మించారు. తన తండ్రికి ఆసరాగా ఉండేందుకు చిన్న తనంలోనే చింతగింజలు సేకరించి, అమ్మి ఎంతోకొంత సంపాదించేవారు. అనంతరం పేపర్ బాయ్ గా ఇంటింటికీ న్యూస్ పేపర్లు వేసేవారు. చిన్నతనంలో చదువుపై పెద్దగా ఆసక్తి చూపని కలాం... తన తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి చదువుపై దృష్టి సారించారు. ఆ తర్వాత చురుకైన విద్యార్థిగా పేరుతెచ్చుకున్నారు. కలాం చిన్న తనంలో ఏడు మంది పిల్లలతో కూడిన జైనులబ్దీన్ కుటుంబం ఎప్పుడూ సందడిగా ఉండేది. చిన్నతనంలో కలాంకు శివప్రకాశన్, రామనాథశాస్త్రి, అరవిందం అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వారంతా సనాతన బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన వారైనా, కలాంతో మాత్రం వారి స్నేహం బలంగా ఉండేది. రామనాథశాస్త్రి తండ్రి లక్షణశాస్త్రి ఆ గ్రామంలోని దేవాలయంలో ప్రధాన అర్చకుడుగా ఉండేవారు. ఆయనంటే కలాంకు అమితమైన అభిమానం. కలాం ఐదో తరగతి చదువుతుండగా, ఆ పాఠశాలకు వచ్చిన కొత్త ఉపాధ్యాయుడు... బ్రాహ్మణ విద్యార్థుల పక్కన కలాం కూర్చోవడాన్ని గమనించి, కలాంను వెనుక కూర్చోబెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మణ శాస్త్రి సదరు ఉపాధ్యాయుడికి చివాట్లు పెట్టారట. 1954లో తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ నుంచి ఫిజిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు కలాం. అనంతరం 1960లో మద్రాస్ ఐఐటీ నుంచి ఏరొనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం బెంగళూరులోని డీఆర్ డీవో లో జూనియర్ సైంటిస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. అక్కడ నుంచి పైకి ఎదగడమే తప్ప వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఆయనకు రాలేదు. ఏపీలోని శ్రీహరికోటకు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం రావడానికి కారణం అబ్దుల్ కలామే. అప్పట్లో కేరళలో మాత్రమే రాకెట్ లాంచింగ్ సెంటర్ ఉండేది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరో రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ భావించారు. ఆ బాధ్యతను అబ్దుల్ కలాంకు అప్పగించారు ఇందిర. దీంతో, కేరళ నుంచి ఏపీ వరకు సముద్ర తీర ప్రాంతాన్ని హెలికాప్టర్ లో గాలించిన కలాం... చివరకు శ్రీహరికోట అయితేనే బెస్ట్ అని నిర్ణయించారు. ఆయన నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించడంతో, 1971లో శ్రీహరికోటలో షార్ కేంద్రాన్ని నిర్మించారు. తన సుదీర్ఘ ప్రస్థానంలో అవకాశాలు, అవార్డులు, రివార్డులు అన్నీ కూడా కలాంనే వెతుక్కుంటూ వచ్చాయి. ప్రపంచంలోని 40 యూనివర్శిటీలు కలాంను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. ప్రపంచంలో మరే వ్యక్తికీ ఇన్ని డాక్టరేట్లు రాలేదంటే అతిశయోక్తి కాదు. కలాం చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనను 1981లో పద్మభూషణ్, 1990లో పద్మవిభూషణ్, 1998లో వీర్ సావర్కర్ పురస్కారంతో సత్కరించింది. 1997లో దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో కలాంను భారత ప్రభుత్వం గౌరవించింది. అత్యంత నాటకీయ పరిస్థితుల్లో 2002లో అబ్దుల్ కలాం భారత 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. తన జీవితమంతా పూర్తిగా పరిశోధనలతో గడిపి, పదవీ విరమణ చేసిన తర్వాత కూడా బోధనలతో బిజీగా గడుపుతున్న వేళ... కలాంకు ఓ ఫోన్ వచ్చింది. "కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని రాష్ట్రపతిని చేయాలనుకుంటోంది. మీ అభిప్రాయం ఏమిటి?" ఫోన్ కాల్ సారాంశం ఇది. "శాస్త్రవేత్తగా ఉన్నా. విద్యార్థులకు బోధిస్తున్నా. నాకెందుకండీ ఈ పదవులు?" కలాం స్పందన ఇది. "దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అత్యన్నత పదవికి మీలాంటి వ్యక్తి అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఫోన్ వస్తుంది. రాష్ట్రపతి పదవిని చేపట్టాలని ప్రతిపాదన చేస్తారు. దయచేసి కాదనకండి... ప్లీజ్" అంటూ ఆ వ్యక్తి చేసిన విన్నపం కలాంను ఆలోచించే విధంగా చేసింది. కాల్ చేసిన వ్యక్తి ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావడం గమనార్హం. ఆప్పటి పరిస్థితుల్లో హిందూయేతర వ్యక్తిని, ముఖ్యంగా ముస్లింను రాష్ట్రపతిని చేయాలని అప్పటి ప్రధాని వాజ్ పేయి భావించారు. దీంతో, ఎన్డీయే కన్వీనర్ గా ఉన్న చంద్రబాబుకు ఫోన్ చేసి మూడు పేర్లను చెప్పి, అందులో ఒక పేరును సెలెక్ట్ చేయమని కోరారు. అందులో నుంచి కలాం పేరును సెలెక్ట్ చేశారు చంద్రబాబు. ఆయన శాస్త్రవేత్తగా ఉన్నారు... రాష్ట్రపతి పదవికి ఒప్పుకుంటారా అనే సందేహాన్ని వాజ్ పేయి వెలిబుచ్చారు. ఆ విషయం నాకు వదిలేయండి... నేను చూసుకుంటా అన్నారు బాబు. ఆ తర్వాత చెన్నైలో ఉన్న కలాంకు ఫోన్ చేసి రాష్ట్రపతి పదవి చేపట్టేందుకు ఆయన్ను ఒప్పించారు చంద్రబాబు. కలాం అభ్యర్థిత్వానికి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఓకే చెప్పడంతో 11వ రాష్ట్రపతిగా కలాం బాధ్యతలు చేపట్టారు. తనకు ముగ్గురు తల్లులు అని కలాం చెబుతుండేవారు. జన్మనిచ్చిన తల్లి ఆషియమ్మతో పాటు, సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మి, సామాజిక సేవకురాలు మదర్ థెరిస్సాలు కూడా తనకు మాతృమూర్తులే అని చెప్పేవారు. ఆయనలోని మానవీయ కోణానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. తన సుదీర్ఘమైన జీవన యాత్రలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ధ్రువ తార నిన్న సాయంత్రం 7.45 గంటలకు నేలరాలింది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ఐఐఎంలో 'జీవించేందుకు అనుకూలమైన గ్రహం' అనే అంశంపై ప్రసంగిస్తూ 6.30 గంటల సమయంలో వేదికపైనే అబ్దుల్ కలాం కుప్పకూలారు. దిగ్భ్రాంతికి గురైన యూనిర్శిటీ సిబ్బంది, విద్యార్థులు, ఇతర ప్రముఖులు ఆయనను హుటాహుటిన షిల్లాంగ్ లోని బెతానీ ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన గుండెపోటుకు గురైన కలాంను బతికించేందుకు వైద్యులు విశ్వప్రయత్నం చేశారు. ఆర్మీ డాక్టర్లు కూడా శత విధాలా ప్రయత్నించారు. అయినప్పటికీ, ఫలితం దక్కలేదు. కలాం తుది శ్వాస విడిచారు. కలాం మరణ వార్తతో యావత్ దేశం ఉద్వేగానికి లోనయింది. తన ముద్దు బిడ్డను కోల్పోయిన భరతమాత నయనాలు కన్నీటితో నిండిపోయాయి. అబ్దుల్ కలాం భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు... కానీ, ఆయన చూపిన దారి మన దేశానికి, యువతకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుంది.