: క్రికెట్ కంటే దేశ ప్రజల భద్రతే ముఖ్యం... పాక్ తో ఆటల్లేవన్న బీసీసీఐ!
అంతర్జాతీయ క్రికెట్ లో ‘దాయాదుల పోరు’గా ప్రసిద్ధికెక్కిక భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ లను సమీప భవిష్యత్తులో చూడలేం. అంతేకాదు, భారత్ తో సిరీస్ ఆడిన తర్వాత రిటైరవుతానంటున్న పాక్ టెస్టు కెప్టెన్ మిస్బావుల్ హక్ కోరిక కూడా తీరేలా లేదు. ఎందుకంటే నిన్న పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ పై ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్ కంటే దేశ ప్రజల భద్రతే ముఖ్యమని చెప్పిన బీసీసీఐ, ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాక్ తో ఆట ఆడబోమని తేల్చిచెప్పింది. దీంతో త్వరలోనే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరుగుతుందని గంపెడాశతో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు గట్టి షాక్ తగిలింది. ‘‘ఉగ్రవాదుల దాడుల వల్ల భారత పౌరుల భద్రతకు, దేశంలో శాంతికి విఘాతం ఏర్పడితే క్రికెట్ ఆడలేం. ఈ విషయాన్ని పాకిస్థాన్ తెలుసుకోవాలి. క్రీడలనేవి భిన్నమైన అంశమే అయినా బీసీసీఐ కార్యదర్శి, పార్లమెంటు సభ్యుడిగా అంతర్గత భద్రత నాకు చాలా ముఖ్యం’ అని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు.