: ‘స్వాట్’ మెరుపులతోనే ఉగ్రవాదులకు ముకుతాడు!
నిన్న పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ పై విరుచుకుపడిన ఉగ్రవాదులు పెను బీభత్సాన్ని సృష్టించేవారే. అయితే ఆర్టీసీ డ్రైవర్ నానక్ చంద్ ఉగ్రవాదులను బెంబేలెత్తిస్తే, ఆ తర్వాత ‘స్వాట్’ బృందం సభ్యులు వారిని చీల్చిచెండాడారు. అసలు ఈ ‘స్వాట్’ అంటే ఏమిటి?... పేరెప్పుడూ వినలేదు కదూ. నిన్నటి ఉగ్రవాద దాడులను తిప్పికొట్టేందుకు నేషనల్ సెక్యూరిటి గార్డ్స్ (ఎన్ఎస్జీ), బీఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఉగ్రవాదుల భరతం పట్టింది మాత్రం ‘స్వాట్’ సభ్యులేనట. అసలు ‘స్వాట్’ అంటే... స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ టీమ్ (ఎస్ డబ్ల్యూఏటీటీ). తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా బృందాలైతే లేవు గాని... జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో స్పెషల్ టీములు ఎప్పటినుంచో పనిచేస్తున్నాయి. డ్రగ్ మాఫియాను అరికట్టడం, మిలిటెంట్ల చేతుల్లో బందీలుగా ఉన్న వారిని విడిపించేందుకు, క్రూరమైన నేరగాళ్లను అదుపు చేసేందుకు ఆ రెండు రాష్ట్రాలు ‘స్వాట్’ బృందాలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రధానంగా ఉగ్రవాదులు తిష్ట వేసిన భవంతుల్లో బందీలుగా ఉన్నవారిని సురక్షితంగా విడిపించడంలో ఈ బృందం సభ్యులు సుశిక్షితులు. అత్యాధునిక ఆయుధాల వినియోగం, వ్యూహాత్మకంగానే కాక వేగంగానూ వ్యవహరించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. నిన్న దీనానగర్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు కూడా ‘స్వాట్’ సభ్యుల మెరుపువేగంతో చేసిన ప్రతిదాడులతోనే తోకముడిచారు. వీరి డ్రెస్సింగ్ చెప్పేలేదు కదూ... నలుపు రంగు టీ షర్ట్, గోధుమ రంగు ప్యాంట్, చేతిలో అత్యాధునిక ఆయుధాలే వీరి ఆహార్యంగా ఉంటుంది.