: కాశ్మీర్ లో పాక్ జెండాలు ఎగురుతున్నా మోదీ మౌనంగా ఉన్నారు: పొంగులేటి
పంజాబ్ లో జరిగిన ఉగ్రదాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. చివరకు టెర్రరిస్ట్ అంశాలను కూడా స్వలాభం కోసం బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో కసబ్ ను ఉరితీశారని... అయితే ఉరితీసిన తర్వాతే అది మీడియాకు తెలిసిందని చెప్పారు. కానీ, బీజేపీ మాత్రం మెమెన్ ఉరిశిక్షను ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తోందని మండిపడ్డారు. ఈ ప్రచారంతో దేశవ్యాప్తంగా మతపరమైన అంశాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పారు. కాశ్మీర్ లో పాకిస్థాన్ జెండాలు ఎగురుతున్నా ప్రధాని మోదీ మాత్రం మౌనంగానే ఉన్నారని ఆరోపించారు. దేశ అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లితే, దానికి మోదీనే బాధ్యత వహించాలని అన్నారు.