: పంజాబ్ లో పోలీస్ స్టేషన్ పై ‘ఉగ్ర’ దాడి... ఇద్దరు మృతి, ఏడుగురికి గాయాలు
పంజాబ్ లో కొద్దిసేపటి క్రితం ఉగ్రవాదులు మెరుపు దాడికి తెగబడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు దీనా నగర్ పోలీస్ స్టేషన్ పై విరుచుకుపడ్డారు. తొలుత అటుగా వెళుతున్న ఓ బస్సుపై కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకువెళ్లారు. తమ చేతుల్లోని తుపాకులతో అక్కడ పేట్రేగిపోయారు. ఈ హఠాత్పరిణామంతో క్షణాల్లోనే తేరుకున్న పోలీసులు కూడా ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల మెరుపు దాడిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ తో పాటు మరో పౌరుడు చనిపోయాడు. ఏడుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్దారు. క్షతగాత్రులను పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదుల మెరుపు దాడితో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.