: కొబ్బరి చెట్టు నవ్వింది... అదెలాగో చూడండి!
కర్ణాటకలోని ఓ కుటుంబానికి ఎదురైన విచిత్రమైన అనుభవం ఇది! ఉడుపి జిల్లాలోని వండ్సే గ్రామంలో గోవింద అనే వ్యక్తి ఇంట్లో ఓ కొబ్బరి చెట్టు ఉంది. ఓ సాయంత్రం ఆ చెట్టు నుంచి చిన్న పిల్లవాడి నవ్వులు వినిపించాయి. దాంతో, ఆశ్చర్యపోయిన ఆ కుటుంబ సభ్యులు కొబ్బరి చెట్టు వద్ద ఎవరైనా పిల్లలు ఉన్నారేమో అని చూస్తే అక్కడెవరూ కనిపించలేదు. కాసేపటి తర్వాత పిల్లవాడి నవ్వు ఆగిపోయింది. మళ్లీ నవ్వులు వినపడడంతో ఈసారి ఆశ్చర్యం స్థానంలో భయం కలిగింది గోవింద కుటుంబ సభ్యుల్లో. దాంతో, గోవింద ఓ జ్యోతిష్యుడిని కలిసి విషయం వివరించాడు. ఆ జ్యోతిష్యోత్తముడు సదరు కొబ్బరి చెట్టుపై దుష్టశక్తులు చేరి ఉంటాయని, హోమం చేస్తే అవి పారిపోతాయని చెప్పాడు. ఆయన మాట విని హోమం చేసినా ఫలితం శూన్యం! అదే రోజు సాయంత్రం మళ్లీ పిల్లవాడి నవ్వులు వినిపించాయి. ఈ రకమైన విచిత్రమైన పరిస్థితిలో గోవింద కుటుంబ సభ్యులు కొట్టుమిట్టాడుతుండగా... కొబ్బరికాయలు కోసే వ్యక్తి వారి ఇంటికి వచ్చాడు. ఆ నవ్వుల కారణమేంటో ఆ వ్యక్తి నోట విన్న గోవింద కుటుంబ సభ్యుల ముఖాల్లో నవ్వులు విరబూశాయి. ఆ వ్యక్తి కొబ్బరి కాయలు కోసే సమయంలో తన సెల్ ఫోన్ ను చెట్టుపైనే మర్చిపోయాడట. అయితే, ఊర్లో చాలా చెట్లు ఎక్కే అతడు, తన ఫోన్ ను ఏ చెట్టుపై మర్చిపోయాడో గుర్తురాక వేరే ఫోన్ నుంచి తన ఫోన్ నెంబర్ కు కాల్ చేసేవాడు. చిన్న పిల్లవాడి నవ్వులే అతడి ఫోన్ కు రింగ్ టోన్ గా పెట్టుకున్నాడు! అందుకే ఆ వ్యక్తి తన ఫోన్ కు కాల్ చేసినప్పుడల్లా గోవింద కుటుంబానికి నవ్వులు వినిపించేవి. ఎవరు నవ్వుతున్నారో తెలియక, పాపం, హడలిచచ్చేవారు! చివరికి గోవింద ఇంటి వద్ద కొబ్బరిచెట్టుపై తన ఫోన్ ఉందన్న విషయాన్ని గ్రహించి, చెట్టెక్కి తన ఫోన్ తెచ్చుకున్నాడా మతిమరపు వ్యక్తి. దీంతో, పిల్లవాడి నవ్వుల వ్యవహారం అలా అందరినీ నవ్వించింది.