: 'గ్రామజ్యోతి'పై కేసీఆర్ ప్రత్యేక దృష్టి... తనయుడికి ఉపసంఘం బాధ్యతల అప్పగింత
బంగారు తెలంగాణ దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో అడుగూ వేస్తోంది. ఈ క్రమంలో, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతే లక్ష్యంగా 'గ్రామజ్యోతి' పథకాన్ని ప్రకటించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ పథకంపై ఈ నెల 30న జిల్లా కలెక్టర్లు, జేసీలతో సమావేశం నిర్వహిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. గ్రామజ్యోతి విధివిధానాల రూపకల్పనకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఉపసంఘంలో మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్ రావు, జోగు రామన్న, తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉంటారని వివరించారు. ఈ పథకం కోసం రానున్న ఐదేళ్లలో రూ.25000 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. జనాభా ప్రాతిపదికన గ్రామాలకు రూ.2 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు నిధులు అందిస్తామని తెలిపారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, గ్రామస్థాయిలో ఎవరికి వారే అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేసుకోవడమే 'గ్రామజ్యోతి' ముఖ్యోద్దేశమని చెప్పారు.