: హామీ ఇస్తే సరిపోదు... అమలు పరచాలి: అన్నా హజారే డిమాండ్
సైనికులకు సంబంధించిన 'ఒకే ర్యాంకు... ఒకే పింఛను' పథకాన్ని అమలు చేయాలంటున్నారు అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే. ఈ మేరకు ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ హామీ ఇస్తే సరిపోదని, పథకాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోదీ విఫలమయ్యారని అన్నారు. ఢిల్లీలో మాజీ సైనికులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అన్నా పైవిధంగా పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్రం దృష్టి పెట్టకపోతే తాను అక్టోబరు 2న దీక్ష చేపడతానని అన్నారు. దీనిపై దేశ వ్యాప్తంగా మద్దతు కూడగడతానని చెప్పారు. ఓ జవాను రాత్రివేళ నిద్రపోకుండా మేలుకుని ఉంటేనే ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారని, అలాంటి జవాను గౌరవంగా బతికేందుకు వీలుకల్పించడం లేదని కేంద్రం తీరును విమర్శించారు. అమరజవాన్ల భార్యలకు నెలకు రూ.4000 ఇస్తున్నారని, ఈ రోజుల్లో ఓ కుటుంబాన్ని నెట్టుకురావాలంటే అవి ఏమూలకు సరిపోతాయని అన్నా ప్రశ్నించారు. 'ఒకే ర్యాంకు... ఒకే పెన్షన్' పథకంపై ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం వెనుకంజ వేయరాదని హెచ్చరించారు.