: ఓటుకు నోటు వ్యవహారంలో ఏ సీఎం కూడా పదవి కోల్పోలేదు: జూపూడి


తెలంగాణ ప్రభుత్వంపై టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు మండిపడ్డారు. హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాజ్యాంగానికి వ్యతిరేకంగా తెలంగాణ సర్కారు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఏ సీఎం కూడా పదవి పోగొట్టుకోలేదని, కానీ, కుట్ర పూరితంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డవారిపై చట్టం చర్య తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై ఇప్పటికైనా నిజాలు మాట్లాడాలని జూపూడి డిమాండ్ చేశారు. నారా లోకేశ్ ఫోన్ ట్యాపింగ్ పై ట్విట్టర్లో చాలా స్పష్టంగా చెప్పారని, దానికి బదులివ్వాలని అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వ్యక్తి ఎంత గొప్ప పదవిలో ఉన్నా కొనసాగేందుకు వీల్లేదన్న విషయం మీకు తెలియదా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీని రూపుమాపాలని ప్రయత్నిస్తే, మీ ప్రభుత్వమే కూలిపోతుందని హెచ్చరించారు. "ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, కానీ, మీరు నియంతృత్వ పోకడలు ప్రదర్శిస్తున్నారు... సుప్రీం మార్గదర్శకాలను మీరితే శిక్షకు గురికాకతప్పదన్న విషయం గుర్తెరగాలి" అని పేర్కొన్నారు. అటు, కాంగ్రెస్ పైనా మండిపడ్డారు జూపూడి. నిజం నిప్పులాంటిదని, ఫోన్ ట్యాపింగ్ పై మీరెందుకు నోరు మెదపరు? అని నిలదీశారు. ఇక, సెక్షన్-8పై వైఎస్సార్సీపీ నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News