: నా హామీ మరవలేదు: మోదీ
బీహార్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ప్రధాని మోదీ వరాల వర్షం కురిపించారు. గతంలో తాను హామీ ఇచ్చినట్టుగా త్వరలోనే రూ. 50 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ఇస్తామని తెలిపారు. ఉత్తర బీహార్ లోని ముజఫరాపూర్ లో బీజేపీ తలపెట్టిన మెగా ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. "నా వాగ్దానం నాకు గుర్తుంది. దాన్ని నెరవేరుస్తాను" అని ఆయన అన్నారు. రాజకీయాల కారణంగా బీహార్ ఇబ్బందులు పడుతోందని, నితీష్ కుమార్ బాధను తాను పంచుకుంటానని మోదీ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, మోదీ వ్యాఖ్యలపై నితీష్ స్పందిస్తూ, ప్రధానిగా పగ్గాలు చేపట్టిన 14 నెలల తరువాత మోదీకి బీహార్ రాష్ట్రం గుర్తుకు వచ్చిందని ఆయన అన్నారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, బీజేపీలు కలసి పోటీ చేసి 2010లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రెండు పార్టీలూ తమ బంధాన్ని తెంచుకున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో జేడీయూ, లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీలు బీహార్ లో కలసి పోటీ చేస్తున్నాయి.