: వందలసార్లు అక్కడికి వెళ్లినా ఆ విషయం గుర్తించలేకపోయాను... ఇవాళ చూశాను!: రాజమౌళి
బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన రాజమౌళిపై ప్రశంసల కుంభవృష్టి కురుస్తోంది. పండితులు, పామరులన్న తేడా లేకుండా ఆయనను "గ్రేట్" అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. ఆయన మాత్రం 'టీమ్ వర్క్' అంటూ వినమ్రంగా సమాధానమిస్తున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్టు అమోఘమైన రీతిలో విజయాన్నందుకున్నా తాను మాత్రం నిగర్విలా ఉండేందుకే ప్రాధాన్యమిస్తూ గుళ్లూ గోపురాలు సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం కర్నూలు జిల్లాలోని మంత్రాలయం పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. పెద్దన్న కీరవాణితో కలిసి రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్నారు. మంత్రాలయం సందర్శన గురించి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. మంత్రాలయం క్షేత్రానికి వందలసార్లు వచ్చానని తెలిపారు. చిన్నప్పటి నుండి ఇక్కడికి వస్తున్నా, ఈ ఆలయంలో ఓ శివలింగం ఉందన్న విషయం మాత్రం ఇప్పుడే గుర్తించానని జక్కన్న తెలిపారు. సిసలైన వైష్ణవాలయంలో శివలింగం ఉండడం ఎంతో ఆశ్చర్యకరమైన విషయమని పేర్కొన్నారు.