: ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా?
ఈ భూమండలంపై ఎన్నో రకాల ప్రాణులున్నాయి. వీటిలో కొన్ని ప్రమాదవశాత్తు అర్థాంతరంగా ప్రాణాలు పోగొట్టుకుంటే, మరికొన్ని ఆయుష్షు తీరి మరణిస్తుంటాయి. కానీ మనిషి మాత్రమే కొన్ని సందర్భాల్లో బలవంతంగా ప్రాణం తీసుకుంటాడు. ఇలా ఆత్మహత్యలకు పాల్పడడానికి ఎవరి కారణాలు వారికుంటాయి. పల్లెల్లో నిరక్షరాస్యులు ఆత్మహత్యలకు పాల్పడితే, పట్టణాల్లో విద్యాధికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా చాలా మంది ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతుంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు వారి ప్రవర్తన ఎలా ఉంటుందనే దానిని వారు వివరిస్తున్నారు. తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆత్మహత్యే శరణ్యమనుకున్నవారు ఒంటరిగా ఉండడానికి, చీకట్లో ఉండడాన్ని బాగా ఇష్టపడతారట. అలాగే వారికి బాగా ఇష్టమైన వస్తువులను దానం చేస్తారు. లేదా వాటిని పట్టించుకోవడం మానేస్తారట. ఏదయినా టాపిక్ మాట్లాడుతున్నప్పుడు బతికి ఏం సాధించాం? ఏం సాధించాలి? అని నిర్వేదం ప్రదర్శిస్తూ ఉంటారట. అలాగే భోజనం మానేయడం, మితిమీరి తినడం, ఎప్పుడూ పరధ్యానంగా ఉండడం కూడా తీవ్ర ఒత్తిడిని సూచిస్తుంటుందట. సాధారణంగా ఆత్మహత్యకు పాల్పడేవారిలో అత్యధికులు, తాడు, కత్తి, విషం వంటివి కొని దాచుకుంటారట, దీనిని గమనించాలని వారు సూచిస్తున్నారు. కొంత మంది మాత్రం 'నాకు బతకాలని లేదు, నేను చనిపోతాను' అంటూ ఇతరులతో పదేపదే అంటూ ఉంటారని వారు సూచిస్తున్నారు. ఆత్మహత్యను నివారించాలంటే వారి మనసుకు దగ్గరై మాట్లాడడమే పరిష్కారం అని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.