: భక్తి బాట పట్టిన ‘సర్’ జడేజా...350 కిలో మీటర్ల పాదయాత్రకు శ్రీకారం
అభిమానులు 'సర్' అనే నిక్ నేమ్ తో పిలుచుకునే టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా మూడు ఫార్మాట్ల జట్లలోనూ సుస్థిర స్థానం సంపాదించాడు. నిన్నటిదాకా అతడి స్థానానికి ఢోకా లేదు. ఫామ్ లో ఉన్నా, లేకున్నా కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ అండతో అలా నెట్టుకొచ్చేశాడు. టెస్టు ఫార్మాట్ కు ధోనీ గుడ్ బై చెప్పడంతో, ఫామ్ లేమితో సతమతమవుతున్న జడేజాకు సెలెక్టర్లు మొండిచేయి చూపారు. జింబాబ్వే పర్యటనకెళ్లిన టీమిండియా జట్టులోనూ అతడికి చోటు దక్కలేదు. తాజాగా లంక సిరీస్ కు కూడా అతడికి నిరాశ తప్పలేదు. అంటే దాదాపుగా అతడి ప్రాభవం కొడిగట్టినట్టే కనిపిస్తోంది. దీంతో అతడిలో భక్తిభావం పొంగుకొచ్చింది. జాతీయ జట్టుకు ఎంపికైతే, తన కులదైవం ఆశాపురాను దర్శించుకుంటానని ఎప్పుడో అనుకున్నాడట. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా ఇప్పటిదాకా అతడికి వీలు కాలేదు. ఇక జట్టులో చోటు కోల్పోయాడుగా, నాటి మొక్కు గుర్తుకొచ్చిన జడేజా ఈ నెల 18న జామ్ నగర్ నుంచి దాదాపు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాచీన యాత్రా స్థలం మతనో మధ్ కు అతడు పాదయాత్ర ప్రారంభించాడు. ఇక్కడే వారి కులదైవం ఆశాపురా మాత వుంది. ఇక అతడి వెంట అతడి తండ్రి, స్నేహితులు కూడా యాత్రలో పాలుపంచుకుంటున్నారు.