: గోల్డ్ క్రాష్... సామాన్యులు తెలుసుకోవలసింది ఇదే!


బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇది అందరూ అంగీకరిస్తున్న విషయమే. మూడు నెలల క్రితం రూ. 28 వేల దగ్గరున్న పది గ్రాముల బంగారం ధర ఇప్పుడు రూ. 25 వేల దిగువకు వచ్చింది. ఈ సమయంలో సామాన్యుడు ఏం చేయాలి? బంగారం కొనుగోలు చేయవచ్చా? లేదంటే మరింతగా తగ్గుతుందని ఆశించి వేచి చూడాలా? బంగారం ఆభరణాలు కొంటే మంచిదా? నాణాలు లేక ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లలో పెట్టుబడులు పెట్టాలా? ఇలా ఎన్నో ప్రశ్నలు 'ఆమ్ ఆద్మీ' మనసుల్లో ఉదయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏం చేయాలన్న విషయమై నిపుణుల సూచనలు ఏంటంటే... ఇప్పటికే బంగారం కొని ఉంటే..: మీరు ఇప్పటికే బంగారంలో పెట్టుబడి పెట్టినట్లయితే, (ఈటీఎఫ్, నాణాలు, ఆభరణాలు, గోల్డ్ ఫ్యూచర్స్ ఏదైనా సరే) ఇప్పటికిప్పుడు బాధ పడాల్సిన పనిలేదు. మరింత పడిపోతుందేమో అని భయపడి అమ్మకాలకు దిగవద్దు. ఈ పతనం ఓ కరెక్షన్ అని మాత్రమే భావిస్తే సరిపోతుంది. ఇదే సమయంలో మరింతగా ధరలు తగ్గవని కూడా చెప్పేందుకు అవకాశాలు లేవు. దీర్ఘకాలంలో బంగారం మంచి రాబడిని అందిస్తుందని కచ్చితంగా చెప్పవచ్చు. ధరల్లో ఒత్తిడి ఓ ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆపై తిరిగి ధర ఆకాశాన్ని తాకుతుంది. కాబట్టి బంగారం ఇప్పటికే కొనుగోలు చేసిన వారు సరైన సమయం, అవకాశం కోసం వేచి చూడాలి. ఇప్పుడు కొనాలని భావిస్తే..: సమీప భవిష్యత్తులో వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు నిర్ణయించుకున్న వారు బంగారం కొనేందుకు ఇది అత్యుత్తమ సమయం. మరికొంచెం సమయం వేచి చూసి (బంగారం ధర ఇంకాస్త తగ్గవచ్చు కాబట్టి) బంగారం కొనుగోలు చేస్తే మంచిది. ఈ స్థాయి ధరలపై బంగారం కొనుగోలు చేసినా లాభం పొందినట్టే. ఎందుకంటే రెండు నెలల క్రితం కొని ఉంటే గ్రాముకు రూ. 300 అధికంగా పెట్టి ఉంటారు కాబట్టి. సంప్రదాయ ఇన్వెస్టర్లు తమ మొత్తం బడ్జెట్ లో 30 నుంచి 40 శాతం బంగారంపై పెట్టవచ్చు. మరింతగా ధరలు తగ్గితే ఇంకాస్త కొనుగోలు చేయడం ద్వారా ధరలను సరాసరి చేసుకుని సులువుగా లాభాలను పొందవచ్చు. వచ్చే రెండేళ్ల పాటు బంగారం ధరల్లో పెద్దగా ర్యాలీ నమోదు కాకపోవచ్చు. కాబట్టి స్వల్పకాలిక పెట్టుబడుల్లో లాభం పొందాలని భావించేవారు ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్, డెట్ ఫండ్స్ తదితర ప్రత్యామ్నాయ మార్గాలనూ ఎంచుకోవచ్చు. మొత్తం సేవింగ్స్ లో 10 శాతం వరకూ బంగారంపై పెట్టవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇతరులకు: తగ్గుతున్న బంగారం ధరలు రెగ్యులర్ గా గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్స్ లో లేనివారిని ఆకర్షిస్తున్నాయి. బంగారం కొనుగోలు, అమ్మకాలు చేపట్టాలన్న ఆలోచన లేనివారు బంగారం కొని దాచుకోవాలని చూస్తున్నారు. బంగారం ధరలపై రెగ్యులర్ గా అప్ డేట్ కాని ఇటువంటి వారు స్వల్ప మొత్తాల్లో పెట్టుబడులు పెట్టడం మంచిది. కాగా, బంగారం ధరల పతనం కేంద్ర ఖజానాపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. కరంటు ఖాతాల లోటు దిగివస్తుంది. దీంతో సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు నిధుల లభ్యత పెరుగుతుంది. మౌలిక వసతుల కల్పన మెరుగుపడి, సామాన్యులకు అధిక లబ్ది కలుగుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

  • Loading...

More Telugu News