: 'ప్రైం మినిస్టర్ సర్, ప్లీజ్'... హోర్డింగులకెక్కిన ఆప్ నిరసన!
ప్రధాని నరేంద్ర మోదీపై ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటిస్తూ, ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలోని ఢిల్లీ సర్కారు హోర్డింగులకెక్కింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టిన ఆప్ ప్రభుత్వం 'ప్రైం మినిస్టర్ సర్, ప్లీజ్' అంటూ 'ఢిల్లీ గవర్నమెంటు చక్కగా పనిచేస్తోంది. ప్రభుత్వాన్ని పనిచేయనివ్వండి' అని రాసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కు లేఖ రాసిన గంటల వ్యవధిలో ఈ హోర్డింగులు నగరమంతటా వెలిశాయి. ఇప్పుడు ఢిల్లీలో ఎక్కడ చూసినా, "ప్రధానమంత్రీ సార్, ప్లీజ్! దిల్లీ సర్కారీకో కామ్ కామ్ కర్నే దీజియే! దిల్లీ సర్కార్ టీక్ కామ్ కర్ రహీ హై! - దిల్లీ సర్కార్" అని హోర్డింగులపై కనిపిస్తోంది. కాగా, కేంద్రం తమ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నిస్తోందని, కేంద్రం చర్యలతో ఎన్నో కార్యక్రమాలు ఆగిపోయాయని ఆప్ సర్కారు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.