: ఈ చాన్స్ పోతే మళ్లీ 144 ఏళ్లు ఆగాల్సిందే!
గోదారమ్మకు మహా పుష్కరాలు... నదీమతల్లికి ప్రతి 144 ఏళ్లకు వచ్చే అతిపెద్ద పండగ. పుష్కరాలు ప్రతి పన్నెండేళ్లకూ వస్తాయి. మహాపుష్కరాలు, నదికి 11 సాధారణ పుష్కరాల తరువాత వస్తాయి. మరొక్క రోజులో మహా పుష్కరాల సంరంభం ముగుస్తుంది. గడచిన 10 రోజులుగా సుమారు 4 కోట్ల మందికి పైగా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే, అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు 3.5 కోట్ల మందికి పైగానే ఉన్నారు. నేడు పుష్కరాల 11వ రోజు కూడా అన్ని ప్రధాన ఘాట్ల వద్దా యాత్రికులు కిక్కిరిసి కనిపిస్తున్నారు. రేపటితో పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో నేడు, రేపు మరింత మంది యాత్రికులు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రాజమండ్రి సమీపంలోని కోటి లింగాల రేవు, కొవ్వూరు గోష్పాద క్షేత్రం, నరసాపురం తదితర ప్రాంతాలతో పాటు బాసర నుంచి భద్రాచలం వరకూ ఉన్న వివిధ ఘాట్లలో తెల్లవారుఝాము నుంచే లక్షలాది మంది ప్రజలు పుణ్య స్నానాలు చేస్తున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ జాం అయినట్టు వార్తలు వస్తున్నాయి.