: బాబు సిద్ధాంతం...దొంగలకు ఉపయోగం: సీపీఎం మధు
ఇసుక మాఫియాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొమ్ముకాస్తున్నారని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు విమర్శించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, అవినీతిపై పోరాటం చేసే క్రమంలో సరిహద్దులు దాటిన వనజాక్షిని సీఎం తప్పుపట్టడం సరికాదన్నారు. దెందులూరు ఎమ్మెల్యేపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని తెలిపిన ఆయన, రౌడీషీటర్ గా ఉన్న ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సరిహద్దు సిద్ధాంతం దొంగలకు బాగా ఉపయోగపడుతుందని ఎద్దేవా చేశారు. ఒక జిల్లాలో దొంగతనం చేసిన దొంగను అనుసరించిన అధికారులు, దొంగ జిల్లా దాటగానే వెనుదిరగాలా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేను రక్షించడానికి బాబు చేసిన ప్రయత్నం ఇసుక మాఫియా శక్తుల కేంద్రంగా మారేందుకు దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.