: రెండు వర్గాలుగా విడిపోయిన 'నాగార్జున' విద్యార్థులు... నిజనిర్ధారణ కమిటీ ముందే దాడులు
గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ కాలేజీ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నియమించిన నిజనిర్థారణ కమిటీ బహిరంగ విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా, విద్యార్థి సంఘాలు ప్రిన్సిపల్, ప్రొఫెసర్ల బాగోతాలపై గొంతు విప్పారు. అంతే కాకుండా విద్యార్థినులతో ఆచార్యుల లేట్ నైట్ పార్టీలు, వారు వేసిన చిందులకు సంబంధించిన వీడియోను నిజనిర్థారణ కమిటీకి అందజేశారు. ప్రొఫెసర్లు యువతులను వేధింపులకు గురి చేసి లొంగదీసుకుంటారని ఆరోపించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబూరావును సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు ప్రిన్సిపల్ బాబూరావుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రిన్సిపల్ అనుకూల, వ్యతిరేక వర్గీయులు, నిజనిర్థారణ కమిటీ ముందే పరస్పర దాడులకు దిగారు. దీంతో నాగార్జున వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా, యూనివర్సిటీలో నెలకొన్న కులరాజకీయాలే జరుగుతున్న ఘటనలకు, దారుణాలకు కారణమని విద్యార్థులు మండిపడుతున్నారు. దీంతో నిజనిర్ధారణ కమిటీ ఏం చేయనుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.