: విపక్ష నేతలను ఆశ్చర్యంలో ముంచెత్తిన మోదీ
రాజకీయాల్లో తన శైలే వేరని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిరూపించారు. అధికార పక్షం, ప్రతి పక్షం అనే తేడా లేకుండా అందరితో కలుపుగోలుగా ఉంటారు. కొన్నిసార్లు ఆయనే చొరవచూపి ప్రతిపక్ష నేతలను పలకరిస్తూ చేతులు కలుపుతారు. తాజాగా పార్లమెంటులో అలాంటి సన్నివేశం కనువిందు చేసింది. రాజ్యసభ వాయిదా పడేందుకు కొద్ది సేపటి ముందు క్వచ్చన్ అవర్ లో సభలోకి అడుగుపెట్టిన ప్రధాని మోదీ, సభ వాయిదా పడిన అనంతరం ప్రతిపక్ష నేతల వద్దకు వెళ్లి పేరుపేరునా పలకరించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, వడోదరలో తనపై పోటీ చేసి ఓటమిపాలైన మధుసూదన్ మిస్త్రీలను పలకరించి, కరచాలనం చేశారు. విపక్ష ఉపనేత ఆనంద్ శర్మ, కరణ్ సింగ్, జైరాం రమేష్ లను పలకరించి, మాట్లాడారు. తరువాత ట్రెజరీ బెంచ్ వద్దకు వెళ్లి సీపీఐ నేత డి.రాజా, బీజేపీ ఎంపీలను పలకరించారు. ఈ సందర్భంగా గుజరాత్ ఎంపీలు మోదీ కాళ్లకు నమస్కరించి తమ విధేయత చాటుకున్నారు.