: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణ రెండు వారాలపాటు వాయిదా
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై నిన్నటి సుదీర్ఘ విచారణ తరువాత హైకోర్టులో ఈరోజు కూడా విచారణ జరిగింది. ఎమ్మెల్యేల అనర్హతపై నవంబర్ 24, 2014న పిటిషన్ వేసినప్పుడు కోర్టు జారీ చేసిన నోటీసులు ఇప్పటివరకు స్పీకర్ కు, ఎమ్మెల్యేలకు అందలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే స్పీకర్ కు నేరుగా హైకోర్టు నోటీసులు జారీచేసే అవకాశం లేదని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఈ సందర్భంగా వాదించారు. వెంటనే స్పందించిన న్యాయమూర్తి... నేరుగా స్పీకర్, సదరు ఎమ్మెల్యేలకు పిిటిషనర్ తరపు న్యాయవాది నోటీసులు అందజేయాలని ఆదేశించారు. వారు నోటీసులు తీసుకున్నట్టు ధ్రువీకరణ పత్రాన్ని కోర్టుకు సమర్పించాలని ఆదేశాలిచ్చారు. తదుపరి విచారణను కోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది.