: 'గోప్యత' ప్రాథమిక హక్కు కాదు: సుప్రీంలో కేంద్రం వాదన
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఆధార్ కార్డులను అనుసంధానం చేయాలని కోరడం పౌరుల వ్యక్తిగత వివరాల గోప్యతను భంగపరిచినట్టు కాదని సుప్రీంకోర్టులో కేంద్రం వాదించింది. "గోప్యతా హక్కు మన రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు కాదు. రాజ్యాంగాన్ని తయారు చేసిన వారు 'గోప్యత'ను ఫండమెంటల్ రైట్ గా గుర్తించలేదు" అని స్పష్టం చేసింది. ఆధార్ కార్డుల అనుసంధానంపై కొందరు వేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ ఈ వాదన వినిపించారు. ఆర్టికల్ 32 ప్రకారం ఈ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. వాదనలు విన్న జస్టిస్ జె.చలమేశ్వర్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఏ నిర్ణయాన్నీ తీసుకోలేదు. ఈ కేసును విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదలాయించాలని భావిస్తున్నట్టు మాత్రం ఆయన తెలిపారు. అంతకుముందు పిటిషనర్ల తరపున న్యాయవాదులు తమ వాదన వినిపిస్తూ, ఆధార్ పేరు చెబుతూ, వ్యక్తిగత వివరాలు సేకరించి పౌరుల హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు.