: మందుబాబులకు మంచు లక్ష్మి కౌన్సిలింగ్!...హైదరాబాదీ పోలీసుల వినూత్న యత్నం
వినడానికి కాస్త విడ్డూరంగానే ఉన్నా, ఇది ముమ్మాటికీ నిజమే. వెండితెరతో పాటు బుల్లితెరపైనా బిజీబిజీగా ఉన్న మంచు లక్ష్మీప్రసన్న మందుబాబులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. అసలు విషయమేంటంటే... హైదరాబాదు రోడ్లపై డ్రంకన్ డ్రైవింగ్ కారణంగా రోడ్డు ప్రమాదాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దీంతో ఇటీవలి కాలంలో సోదాలు ముమ్మరం చేసిన పోలీసులు పెద్ద సంఖ్యలో డ్రంకన్ డ్రైవర్లను పట్టుకుంటున్నారు. అమల్లో ఉన్న చట్టాల కారణంగా వీరికి చిన్నపాటి ఫైన్ తోనే సరిపెట్టాల్సి వస్తోంది. అయితే ఎన్ని సోదాలు చేసినా డ్రంకన్ డ్రైవ్ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. దీనికి చెక్ పెట్టేందుకు కౌన్సిలింగే మందు అని ట్రాఫిక్ పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. మరి మందుబాబులకు కౌన్సిలింగ్ ఇచ్చేవారెవరు? అప్పుడే పోలీసుల మదిలో మంచు లక్ష్మీప్రసన్న పేరు మెదలిందట. సామాజిక స్పృహతో పలు కార్యక్రమాలు చేపడుతున్న ఆమెను పోలీసులు సంప్రదించారు. దీనికి లక్ష్మి కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది. త్వరలోనే మందుబాబులకు ఆమెతో కౌన్సిలింగ్ ఇప్పించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.