: అమరావతిలో వాటర్ ట్యాక్సీలు... దేశంలో తొలిసారిగా కొత్త రవాణా వ్యవస్థ!
నగరాల్లో బస్, రైలు ట్రాన్స్ పోర్టు వ్యవస్థ మనకు తెలిసిందే. రైల్వే ట్రాన్స్ పోర్టులో ఇటీవల మెట్రో రైలు, హైస్పీడ్ రైలు తదితర మాటలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికీ భిన్నంగా సరికొత్త రవాణా వ్యవస్థకు నవ్యాంధ్ర రాజధాని అమరావతి స్వాగతం పలకనుంది. నగరంలో జల రవాణాకు తెరతీస్తూ ఏపీ వినూత్న చర్యలకు శ్రీకారం చుడుతోంది. సింగపూర్ ప్రతినిధి బృందం అందజేసిన సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్ పై ప్రస్తుతం విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా కొత్త రవాణా వ్యవస్థ అంశం ప్రస్తావనకు వచ్చింది. నవ్యాంధ్ర రాజధానిలో బస్సు, రైలు ట్రాన్స్ పోర్టు వ్యవస్థలతో పాటు వాటర్ ట్యాక్సీల వ్యవస్థ కూడా అందుబాటులోకి రానుందట. అమరావతి కృష్ణా నదికి అభిముఖంగా నిర్మితం కానున్న విషయం తెలిసిందే. నది నుంచి ఓ పాయను విడదీసి దానిని అమరావతి మధ్య నుంచి తీసుకువెళుతూ చివరకు ఆ పాయను మళ్లీ నదిలో కలపనున్నారు. నగరంలో ప్రవహించే ఈ పాయలోనే వాటర్ ట్యాక్సీలు ప్రయాణం సాగించనున్నాయి. ప్రజలను వివిధ ప్రాంతాలకు తరలించనున్నాయి. రైల్వే, బస్ స్టేషన్ల తరహాలో వాటర్ ట్యాక్సీ స్టేషన్లు కూడా ఏర్పాటు కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. మిగిలిన రెండు ట్రాన్స్ పోర్టు వ్యవస్థలకు అనుసంధానంగా వాటర్ ట్యాక్సీ ట్రాన్స్ పోర్టు వ్యవస్థ పనిచేస్తుందట. ఇదిలా ఉంటే, ఇప్పటిదాకా దేశంలో ఈ తరహా ట్రాన్స్ పోర్టు సిస్టం ఎక్కడా లేదు. తొలిసారిగా అమరావతిలో అందుబాటులోకి రానుంది.